మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మారిన వ్యక్తులపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరోక్షంగా చెప్పకపోయినా ఆ విమర్శలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అందరికీ తెలుసు. ఇక ఈ విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాస్త సీరియస్ గానే స్పందించారు. అసలు తెలంగాణలో మహానాడు సందడి ఏంటని తిట్టిపోశారు. తండ్రి, కొడుకులు పరస్పర పొగడ్తల కోసమే ఈ మహానాడు ను ఏర్పాటుచేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు అద్దంలో ఓసారి మొహం చూసుకోవాలని కాస్త ఘాటుగానే విమర్శించారు. ఏడాది గడిచిన తెలంగాణను పట్టుకుని వెళాడుతున్నాడన్నారు. పనిలోపనిగా యువనేత లోకేష్ ను కూడా మంత్రి గారు అందుకున్నారు. లోకేష్ లో ట్విట్టర్ పిట్ట అని పేర్కొన్నారు. ట్విట్టర్ పిట్ట వయస్సుకు మించి విమర్శలు చేస్తోందని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. హెరిటేజ్ సాయంతో నారా కుటుంబం బాగానే వెనకేసుకొచ్చిందన్నారు. హైటెక్ సిటీని తప్ప చంద్రబాబు హైదరాబాద్ కు చేసిందేమీ లేదని గుర్తుంచుకోవాలని చురకలంటించారు తలసాని.