రాజకీయవేత్తల అవినీతిని బయటపెట్టేందుకు సాధారణంగా స్టింగ్ ఆపరేషన్లు జరుగుతుంటాయి. తెహల్కా లాంటి బీభత్సమైన స్కాంలను బయటపెట్టి బడా బడా నేతలకు సైతం భవిష్యత్తు లేకుండా చేసింది ఈ స్టింగ్ ఆపరేషన్లే. అందుకే ఈ బుల్లి కెమెరా వ్యవహారాలంటే నేతలకు దడ, వణుకు. అలాంటిది ఓ రాజకీయ నేతనే ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తెలంగాణ వాణిజ్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం అదే పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. భాగ్యనగరానికి వచ్చే రెవెన్యూ ఆదాయం బాగా తగ్గిపోవటానికి గల కారణాలను అన్వేషిస్తున్న క్రమంలో ఓ విషయం వెలుగు చూసిందట. దీంతో పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు స్వయంగా మంత్రే లైన్లోకి వచ్చారు. హైదరాబాద్ మలక్ పేటలో ఉన్న రేస్ క్లబ్ కు డబ్బిచ్చి కొందరు అధికారులను తలసాని పంపించారు. ఆ డబ్బుతో వారు రేస్ క్లబ్ లో పందెం ఆడారు. పందెం ఆడిన అధికారుల్లో కొంత మంది గెలిచారు కూడా. ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పందెం గెలిచిన వారు, డబ్బును తీసుకుని హాయిగా వెళ్లిపోతున్నారు. గెలిచిన డబ్బుకు పన్నులు కట్టడం లేదు. వాస్తవానికి ఇలా పందెంలో గెలిచిన సొమ్ములో 14.5 శాతం పన్నును ప్రభుత్వానికి వాటాగా చెల్లించాల్సి ఉంది. కానీ 95 శాతం మంది పంటర్లు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. దీంతో తలసాని స్టింగ్ ఆపరేషన్ ద్వారా రేస్ క్లబ్ లో జరుగుతున్న భాగోతాన్ని బయటపెట్టారు. ఇకపై పన్నుల విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారట. ప్రస్తుతం ఈ వ్యవహారం జాతీయ మీడియాలో కూడా హైలెట్ కావటం విశేషం.