ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బాహ్యంగా కనిపించినప్పటికీ ఏసీబీ చేత జరిపించాల్సిన తతంగాన్ని నడిపిస్తూనే ఉంది. విచారణ పేరిట తెలుగుదేశం నేతలను ఒక్కోక్కరికి ముచ్చెమటలు పోయిస్తున్న ఏసీబీ మరికొంతమంది కీలక నేతలను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ఓటుకు నోటు కేసులో ఏ4 గా ఉన్న జెరూసలెం ముత్తయ్య ఆరోపించాడు. విజయవాడలో ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు కేసును తప్పుదొవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ఇందులో భాగంగానే పనిమనుషులు, ఆఫీస్ బాయ్ స్థాయి ఉద్యోగులను కూడా వారి వదలకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. అసలు కేసుకు సంబంధంలేని వారిని విచారణ పేరిట సాయంత్రం వరకూ కార్యాలయంలో కూర్చోబెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అసలు ఓటుకు నోటు కేసే లేదని, అదంతా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ సృష్టని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇకనైనా తన మైండ్ గేమ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు.