ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి కారణమైన ఓటుకు నోటు కేసులో మరో కీలక వ్యక్తిని విచారించేందుకు తెలంగాణ ఏసీబీ ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ యువజన విభాగం తెలుగు యువనేత జిమ్మీబాబు ఈ కేసులో కీలకం కానున్నాడట. స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ ను పరిచయం చేసిందే ఈ జిమ్మీబాబు అని తెలుస్తోంది. కోర్టుకిచ్చిన వాంగూల్మంలో స్టీఫెన్ సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జిమ్మీబాబును విచారించేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తమయ్యారు. మూడు రోజుల క్రితమే అతనికి నోటీసులు జారీచేసిన ఏసీబీ సోమవారం అతన్ని తీవ్రంగా విచారించనుంది. కేసు నమోదైన దాదాపు నెలరోజుల తర్వాత అతని పేరు బయటికి రావటంతో అతని నుంచి కీలక సమాచారం అందవచ్చుననే ఉద్దేశంలో తెలంగాణ ఏసీబీ ఉందట, అంతేకాదు జిమ్మీ బాబుకు అగ్రనేతలతో కూడా దగ్గరి సంబంధాలు ఉండటంతో పెద్ద తలల పేర్లు బయటికి రావచ్చుననే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇతనితోపాటు మరో నేత వీరయ్యను కూడా తెలంగాణ ఏసీబీ విచారించనుంది.