రాజకీయ ప్రకంపనలు సృష్టించి తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పటికీ తాము మాత్రం వదలమని కేసుని ముందుకు తీసుకెళ్తున్న ఏసీబీ అధికారులు మంగళవారం చార్జిషీటు దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోసహ మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ, జెరూసలెం, మత్తయ్య పేర్లను ప్రస్తావించిన ఏసీబీ మొత్తం 39 మంది సాక్ష్యులను విచారించినట్లు పేర్కొంది. కీలకమైన అంశం కావటంతో మరింత సమయంతోపాటు, మరికొంతమందిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తిని అధికారులు కోరారు. ఆశ్చర్యకరరీతిలో ఈ వ్యవహారంలో ఇటీవలె అరెస్టయి, బెయిల్ పై విడుదలయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరు మాత్రం చార్జిషీట్ లో పేర్కొనక పోవటం విశేషం. ఆయన విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ఏసీబీ విజ్నప్తి చేసినప్పటికీ కోర్టు వినకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కీలకమైన వ్యక్తి కావటంతో ఆయన పేరుతో ప్రత్యేక చార్జిషీట్ ను దాఖలు చేయనున్నట్లు సమాచారం.