కలలు కనండి అన్న పెద్ద మనిషి అర్థాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోయాడు. భారతరత్న, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం (84) ఇక లేరనే విషయాన్ని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. సోమవారం సాయంత్రం మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లో ఐఐఎమ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆర్మీ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తమిళనాడు లోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో 1931 అక్టోబర్ 15 జన్మించిన ఆవుల ఫకీర్ జైను లబ్దిన్ కలాం కష్టాల కడలిలోనే పెరిగారు. తండ్రికి సహయంగా పేపర్ బాయ్ గా పనిచేస్తూ చదువును కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత డీఆర్ డీఓ లో శాస్త్రవేత్తగా పనిచేశారు. రక్షణా రంగానికి విశిష్ట సేవలు అందించారు. దేశం గర్వించదగ్గ క్షిపణులను రూపొందిచటంలో ఆయన కృషి ఎనలేనిది. 2002 నుంచి 2007 వరకు భారత దేశానికి ప్రథమ పౌరుడిగా నియమించబడ్డారు. వివాదాస్పద రాష్ట్రపతిగా ఆయన ఐదేళ్లు కొనసాగారు. శాస్త్రవేత్తగానే ఓ మంచి ఉపాధ్యాయుడిగా కూడా ఆయన విద్యార్థులను బాగా ప్రభావితం చేశారు. కలలు కనండి అలాగే ఆ కలలు సాకారం చేసుకునేందుకు శ్రమించండి అని విద్యార్థులకు ఆయనిచ్చిన సందేశం కలకాలం గుర్తుండిపోతుంది. ఆరోగ్యం సహకరించకపోయినా సరే వారి కోసం ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఆయన ముందుకు రావటం గొప్పవిషయం. సోమవారం ఉదయం కూడా షిల్లాంగ్ లోని ఐఐఎం విద్యార్థులకు లివబుల్ ప్లానెట్ అనే అంశం మీద ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్తున్నానని ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. ఆయన అందించిన సేవలకు ప్రభుత్వాలు ఆయనను భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, లాంటి బిరుదలతో సన్మానించింది. ఆయన మృతికి నీహార్ ఆన్ లైన్ ఘనంగా నివాళులర్పిస్తుంది.