నువ్వెంతంటే నువ్వంతా... ఇది తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల మధ్య జరిగే వాగ్వాదమే. తెలిసిన విషయమే. విభజన తర్వాత ప్రతీ విషయంలోనూ పరస్పర విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు. ఓవైపు రాజధాని నిర్మాణం కోసం, పెట్టుబడుల కోసం దేశ విదేశాలు పర్యటిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొత్త కొత్త పరిశ్రమల స్థాపనకని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఈ ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అధికారిక పర్యటన సో... సాధారణంగానే అధికార బృందం కూడా వెంట వెళ్లేది. ఓవైపు నిధుల కొరత అంటూనే ఇంత జల్సా ప్రయాణాలు అవసరమా అని ప్రతిపక్షాల నుంచి సెటైర్లు పడ్డాయ్. ఇది పక్కనబెడితే...
గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అస్సలు తగ్గట్లేదు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. తాజాగా వచ్చే వారంతో తన అధికార గణంతో చైనాకు చెక్కేయనున్నారు. అంతటితో ఆగక ఓ ప్రత్యేక సీఆర్ జె ఛార్టర్డ్ విమానాన్ని ప్రయాణం కోసం అద్దెకు తీసుకున్నారు. అది ఓకే కానీ దాని అద్దె భయపెట్టేదిగా ఉంది. అక్షరాలా 2కోట్ల మూడు లక్షల 84వేల రూపాయలతో దానిని బుక్ చేసుకున్నారట. అవార్డులు, రివార్డుల పేరిట కోట్లకు కోట్లు కుమ్మరించడంతోపాటు పథకాలకు కూడా అదే ఫాలో అవుతూ ఇప్పుడు టూర్లకు కూడా అదే రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. ఎంతైనా ధనిక రాష్ట్రం కదా. ఎంతైనా ఖర్చు పెడతారు లేండి.
పైసా కోసం పైసా పెట్టాల్సిందే.. కానీ, చైనా పర్యటన ద్వారా ఎంత వస్తుందో ఖచ్ఛితంగా చెప్పలేం. అలాంటప్పుడు ఇలాంటి దర్పాలకు పోతే చారాణ కోడికి బారాణా మసాలాలా అవుతుంది. బాబులా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.