ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పెద్ద తల కావటంతో బెయిల్ వస్తే బయటకు వెళ్లి సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరపున అడ్వోకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపించినా ప్రయోజనం లేకపోయింది. విచారణ ముగిసినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, ఏసీబీ కి అవసరమైనప్పుడు హాజరుకావాలని రేవంత్ ను ఆదేశించింది. అయితే బెయిల్ దొరికినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ ను వదలదట. బెయిల్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తీరుతామని ప్రభుత్వం తరపున అదనపు న్యాయవాది అరుణ్ కుమార్ చెబుతున్నారు. వీడియో పుటేజ్ లో రేవంత్ రెడ్డి బాస్... బాస్ అని పదేపదే అన్నారు. అసలు ఆ బాస్ ఎవరో తేలాల్సి ఉందని ఏజీపీ అన్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఆ బాస్ ఎవరో తెలిస్తే ఎ-1గా ఉన్న రేవంత్ ఏ-2 కి మారే అవకాశం ఉందన్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటిదాకా తెలియలేదని, ఈ వ్యవహారాన్ని వదిలే ప్రసక్తే లేదని అరుణ్ తెలిపారు. రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో బెయిల్ పై పిటిషన్ వేస్తామన్నారు.