తెలంగాణ ప్రజలకు ఇక్కడి తెలుగుదేశం పార్టీ నేతలు శత్రువల్లా తయారయ్యారని టీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో పుట్టి, ఆంధ్రా నేతల కొమ్ము కాస్తున్న తెలుగుదేశం నేతలను ఆ రాష్ట్ర సరిహద్దుల దాకా తరిమి కొడతామని ఆయన ఫైరయ్యారు. సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీ టీడీపీ నేతలు ఆంధ్రా నేతల పాటకు వంత పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవాలన్న కుయుక్తితో, సీడబ్ల్యూసీకి తెలుగుదేశం పార్టీ లేఖను ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తక్షణం లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం కలిగేలా ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని ఇక్కడి తెలుగుదేశం నేతలు ప్రశ్నించకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.