చంద్రబాబు కొట్టినా టీడీపీలో ఎలా కొనసాగారు?

March 30, 2016 | 03:30 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pocharam_chandrababu_niharonline

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై జరిగిన చర్చ సందర్భంగా పోచారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వద్దని తాను ప్రతిపాదించగా చంద్రబాబు అసహనానికి గురయ్యారని ఆయన తెలిపారు. తనపై అంతెత్తున ఎగిరిన చంద్రబాబు అంతటితో ఆగకుండా తనపై చేయిచేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాను నాడు బయటపెట్టలేదని పేర్కొన్న పోచారం.. తొలిసారిగా ఆ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. ప్రైవేటీకరణ వద్దని చేతులు జోడించి వేడుకుంటే చంద్రబాబు వద్ద తనకు జరిగిన సత్కారం దెబ్బలేనని ఆయన వ్యాఖ్యానించారు.

                                         కాగా తనను కొట్టారంటూ పోచారంపై చేసిన వ్యాఖ్యలపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి భవిష్యత్తులో కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా ఆయన చెబుతారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అందుకున్న జీవన్ రెడ్డి,  చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు. పోచారం సంచలన ఆరోపణలు, వాటిపై విపక్ష నేతల ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ