కర్నూలు ఫ్యాక్షన్ రాజకీయం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. సోమవారం రాత్రి జిల్లాలోని నంద్యాల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్, టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు తులసిరెడ్డిపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిపై వేగంగా స్పందించిన శిల్పా మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన భూమా నాగిరెడ్డి వర్గమే ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. అంతేకాకుండా దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లకు ఫిర్యాదు చేస్తానని కూడా శిల్పా ప్రకటించారు.
అనుకున్నదే తడవుగా మంగళవారం ఉదయం హైదరాబాదు చేరుకున్న ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్న తర్వాత తమకు ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏనాడూ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడలేదని తెలిపారు. భూమా మాత్రం పార్టీలోకి రాగానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అధినేతకు ఫిర్యాదు చేశారు. భూమాను కట్టడి చేయాల్సిందేనని, లేకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన చంద్రబాబుకు చెప్పారు.