తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం కలిసి పని చేస్తామని అమరావతి పండగ సందర్భంగా కేసీఆర్ వేదిక మీద ప్రసగించినప్పటి నుంచి రాజకీయ వాతారణం పూర్తిగా మారిపోయింది. మంట పెట్టిన నోటుకు ఓటును సైతం పక్కన పెట్టేయటంతోపాటు కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందాన వీరిద్దరు ఒకే తాటిపై పనిచేసేందుకు సిద్ధమైపోయినట్లేనని అర్థమౌతోంది. భవిష్యత్తులో ఈ సంబంధాలు బెడిసి కొడతాయేమోనన్న భయాన్ని ప్రస్తుతానికైతే పక్కన పెడితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూసి ఆనందించటం మాత్రం చేయాల్సిందే. ఇదే టైంలో ఎవరికి వారు తమ తమ రాష్ట్రాలను పురోగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలను మాత్రం వదలటం లేదు. అందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలట్లేదు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ రిసెప్షన్ ను వేదికగా చేసుకుని తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇద్దరు హస్తినలో పాగా వేశారు. ఈ పోటీల్లో ముందుగా చెప్పుకోదగింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురించే.
అసలు రాజధానే అంటూ లేని రాష్ట్రానికి సీఎం అయి కొత్త రాజధాని నిర్మాణం అనే బృహత్తర కార్యాన్ని నెత్తిమీద వేసుకున్నాడు. ముఖ్యంగా ప్రతిపక్షాల విమర్శలకు పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు అనే ఘాటైన సమాధానంతో రిప్లై ఇస్తున్నారు. అయితే అదే సమయంలో కేంద్రం అందించే అరకొర సహకారంపై పెదవి విరపులు విరవకుండా వారి వెంటపడుతున్నాడు. ఓవైపు కేంద్రం నుంచి ప్రత్యేకంపై ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ హోదాతోపాటు ప్యాకేజీ ను కూడా లాక్కుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పంక్షన్ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకంగా హోదా, ప్యాకేజీ అంశాల కోసం చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఇప్పటిదాకా ఖరారైన ఈ భేటీల తర్వాత మరికొంత మంది కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి తెలుగోడును వినిపించనున్నారు.
ఇక ఇదే బాటలో కేసీఆర్ కూడా పయనిస్తున్నారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వెనుకబాటుతనం, అప్పులో కూరుకుపోవటం వంటి అంశాలను సాకుగా చూపి భారీ ప్యాకేజీ పట్టాలని కేసీఆర్ ఫ్లాన్. అంతేకాదు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పెద్దలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తన అవసరాలకు పనికి వచ్చే వారందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారని ప్రస్తుత పరిణామాలు తేల్చిచెపుతున్నాయి. చంద్రబాబు కంటే ముందుగా మంగళవారం సాయంత్రమే ఆయన ఢిల్లీలో మకాం వేశారు. అంతేకాదు గురువారం సాయంత్రం విజ్ఞాన్ భవన్ లో జరిగే శరద్ పవార్ బర్త్ డే వేడుకలకు కూడా హాజరవుతారు. ఈ రెండు వేడుకలు కూడా కేవలం అభినందన పూర్వకమైనవో లేదా ఆత్మీయపరమైనవో కావని రాజకీయవర్గాలు అంచనావేస్తున్నాయి. కేబినెట్ లో మోదీ తర్వాత జైట్లీదే ప్రముఖ స్థానం. పైగా ఆర్థిక మంత్రి. దీంతో ఆయనను మచ్చిక చేసుకోవాలనే ఈ వేడుకకు కేసీఆర్ వెళ్లినట్లు అంచనా. పవార్ వేడుకకు హజరవ్వటం వెనుక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయి. జల పంపకాల నేపథ్యంలో మహ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీతో మైత్రి మంచిదని కేసీఆర్ ఈ వేడుకకు కూడా హాజరుఅవుతున్నారుట. తద్వారా ఢిల్లీ పెద్దలకు దగ్గరయి రాష్ట్రానికి భవిష్యత్తులో కావాల్సిన అవసరాలను తీర్చుకునేందుకు మార్గం సులువవుతుందని కేసీఆర్ ఆలోచనగా చెప్పవచ్చు. ఏదేమైనా ఫ్లాన్లు వేరైనా ఇద్దరి లక్ష్యం రాష్ట్రాల ప్రగతి కావటంతో మీడియా కళ్లన్నీ ఢిల్లీ వైపే ఉంది.