వివాదాలకు మంత్రులు, సెలబ్రిటీలే కాదు ఉన్నత పదవుల్లో ఉన్న వారు కూడా తామేం తీసిపోం అంటున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాం నాయక్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపారు. జాతీయగీతాన్ని మధ్యలో ఆపి ఆయన వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. ఈ ఘటన ఈ రోజు అఖిలేష్ సింగ్ ప్రభుత్వంలో జరిగిన మంత్రి వర్గ కార్యక్రమంలో చోటుచేసుకుంది.
రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం కార్యక్రమాన్ని ముగించేందుకు జాతీయగీతాలాపన ప్రారంభమైంది. ఇంతలో సర్ధార్ వల్లభాయ్ జన్మదినం సందర్భంగా జాతీయ ఐక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించాలని ఆయన భావించారుట. దీంతో 'జనగనమన'ను ఆలపిస్తుండగా మధ్యలోనే ఆపేయాలంటూ ఆయన ఆదేశించారు. జాతీయగీతం పూర్తయితే కార్యక్రమం ముగిసిపోతుందనే భావనలో... జాతీయగీతాన్ని మధ్యలోనే ఆపమని సంజ్ఞ చేయడమే కాక, నోటితో కూడా ఆదేశించారు. దీంతో, జాతీయగీతాలాపన మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో, అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారట. అంతేకాదు అక్కడున్న కొందరైతే గవర్నర్ చేసిన పనికి బహిరంగగానే విమర్శించారట. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రాం నాయక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తన చర్యలతో జాతీయగీతాన్ని అవమానపరిచారని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాం నాయక్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.