ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ మహానుభావునికి నివాళులర్పించింది. ప్రధాని మోదీతో సహా కేంద్ర ప్రభుత్వం ఆ మహోన్నత వ్యక్తిని స్మరిస్తూ పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించింది. దేశాన్ని నిర్మించిన సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ను కాంగ్రెస్ మరిచిపోయిందని బీజేపీ విరుచుకుపడింది. సర్దార్ పటేల్ వల్ల దేశ ఐక్యత నిలబడిందని,చైనా యుద్ద సమయంలో నెహ్రూ ఈశాన్య భారత దేశాన్ని పట్టించుకోలేదని పేర్కొంది. మహనీయులను మరిచిపోవటం కాంగ్రెస్ కి కామనేనని వ్యాఖ్యానించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓవైపు వేడుకల్లో పాల్గొంటూనే మరోవైపు బీజేపీపై విరుచుకుపడింది.
అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పే అర్హత బీజేపీకే లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో జరిగిన ఇందిరాగాంధీ వర్ధంతి, వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత దేశాన్ని సుస్థిరమైన దేశంగా నిలిపిన ఘనత సర్దార్ పటేల్ ఇందిరాగాంధీలకే చెందుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న పనులకు, సర్దార్ పటేల్ ఆశయాలకు అస్సలు పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి అసలు పటేల్ పేరు ఉచ్చరించే అర్హత లేదని ఆయన తెలిపారు.
ఓవైపు కాంగ్రెస్ పట్టించుకోని పరిస్థితుల్లో ఉందని బీజేపీ అంటుంటే... అసలు పటేల్ పేరు పలికే అర్హత బీజేపీకి లేదంటూ కాంగ్రెస్ ఇలా ఆ ఉక్కు మనిషి పై రాజకీయాలు చేసుకుంటున్నాయి ఇరు పార్టీలు.