మిత్రపక్షం అయినప్పటికీ అధికార టీడీపీ పట్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యవహారశైలి విచిత్రంగా ఉంటోంది. గతంలో జగన్ తో ఏకాంతంగా చర్చించినప్పుడు ఆయన పార్టీ మారతారనే వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత అదంతా హుళక్కేనని తేలింది. కానీ, సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలతో చర్చించటంలో మాత్రం రాజుగారిది అందెవేసిన చేయి. అలాంటి వ్యక్తి ఏపీ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా ఆసక్తికరంగా ఉంది.
సోమవారం ఉదయం సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే మైక్ అందుకున్న విష్ణు ప్రభుత్వం పై కాస్త ఘాటుగానే విరుచుకుపడ్డారు. సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా తన బాధ్యతని నిర్వర్తించడంలో విఫలం అవుతోందనే ఉద్దేశ్యంతోనే తాను ప్రతిపక్ష బెంచీలో కూర్చున్నానని, కనుక తెదేపా తమకు మిత్రపక్షమయినా, తాను ప్రతిపక్ష పాత్ర పోషించవలసివస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇసుక మైనింగ్ గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇటువంటి అక్రమాలకూ అడ్డుకట్ట వేసి దానిని ఆదాయవనరుగా మార్చుకొంటే ఈ ఆర్ధికసమస్యల నుంచి కూడా బయటపడవచ్చును కదా? అంటూ ప్రభుత్వానికి సూచన కూడా ఇచ్చారు.
ఇక సాయంత్రం కామన్వెల్త్ డే సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన విష్ణుకుమార్ బాబుని ఆకాశానికెత్తేశారు. చంద్రబాబును ‘దేవుడు పంపిన దూత’గా అభివర్ణించారు. ‘‘చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతారని ఆశిస్తున్నా’’ అని రాజు వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఇలా పొగడటం కొత్తేం కాదు. మిత్రపక్షం తమకు అవకాశం లేకుండా చేస్తుందని, సభలో ప్రాధాన్యం ఇవ్వటం లేదని బీజేపీ విమర్శించిన మరునాడే రాజు గారు ఇలా రకరకాలుగా వ్యవహరించటం గమనార్హం.