ఎలాంటి ప్రజా ప్రయోజన అంశాలు చర్చకు నోచుకోకుండానే ఈ దఫా పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. అయితే అది ముందుగా ఊహించిందే. లలిత్‌గేట్, వ్యాపమ్ సంబంధిత అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా కాలం కర్పూరం లా హరించుకుపోయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ బిల్లుతో సహా వస్తు సేవల పన్ను బిల్లు వరకు ఏదీ సభ ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయాయి. పోనీ ప్రజా సమస్యలపై చర్చ సాగిందా అంటే నవ్వు రాక మానదు. దాదాపు 260 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందంటే వెనువెంటనే ఆగ్రహాం రాక మానదు. ఇటు లోక్‌సభతోపాటు, అటు పెద్దల సభలోనూ దాదాపు మూడు వారాల పాటు ప్రతిష్టంభన రాజ్యమేలింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగనివ్వబోమని కాంగ్రెస్ నాయకత్వం ముందుగానే స్పష్టం చేసింది. దీంతో ఈ దఫా సమావేశాలు నిష్ఫలమౌతాయని రాజకీయ విశ్లేషకులు ముందుగానే చెప్పేశారు.
'న ఖావూంగా...న ఖానే దూంగా' (తినను, తిననివ్వను) అంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి గద్దెనెక్కిన మోదీ తన మంత్రివర్గంలో అవినీతి, అక్రమాలు వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ మొత్తం ఘట్టంలో ఆయన మౌనంగా ఉండిపోవడం విశేషం. అనేకానేక సమస్యలతో సతమతమౌతున్నా... అవేవీ పట్టకుండా తమ రాజకీయ ఎత్తులు, పైఎత్తులు, స్వప్రయోజనాలే ప్రధానంగా ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
పార్లమెంటు సమావేశాలు ఇంత నిరర్థకంగా ముగియడానికి అధికారంలో ఉన్న బిజెపి ప్రధానంగా బాధ్యత వహించాలి. తాజా సమావేశాల్లో కాంగ్రెస్ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించిందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ గతంలో తాను కూడా ఇదే పని చేసింది. యుపిఎ-2 హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రుల రాజీనామాకై పట్టుబట్టి అత్యధిక రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ఆటంకపరిచిన కమలం ఇప్పుడు గురివింద గింజలా పార్లమెంటరీ ఔన్నత్యం గురించి నీతులు వల్లించడమే విచిత్రమే కదా.