రోజా టెన్షన్ లేపి తుస్సుమనిపించింది

March 17, 2016 | 04:05 PM | 4 Views
ప్రింట్ కామెంట్
roja1-Suspension-lift-niharonline

సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టి వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల తర్వాత మళ్లీ వాదనలు వింటామని న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీకి రోజా హాజరుకావచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే కోర్టు ఉత్తర్వులు అందుకున్న రోజా నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం న్యాయవాదులతో కలిసి ఆమె అసెంబ్లీకి చేరుకున్నారు. రోజాను అడ్డుకుని తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడతాయోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవేళ అసెంబ్లీ గేటు వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్షల్స్ ఆమెను అడ్డుకున్నారు.

                     అయితే రోజా తరుపు న్యాయవాది పోలీసులు, మార్షల్స్ కు కోర్టు ఆర్డర్ చూపించారు. దీంతో వారు ఆమెను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారు. దీంతో ఆమె నేరుగా అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలిసి హైకోర్టు ఆర్డర్ ను అందజేశారు. నేడు అసెంబ్లీ వాయిదా పడడంతో రేపు స్పీకర్ ను కలిసి ఆమె కోర్టు ఆర్డర్ అందజేయనున్నట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో నగరి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచుకున్నారు. ఊరటతో తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా ఇప్పుడు ఖచ్ఛితంగా టీడీపీపై మరింత రెచ్చిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ