ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే కాదు మండలిలోనూ మాటలు కోటలు దాటుతున్నాయి. కాంగ్రెస్ పక్ష నేత సీ.రామచంద్రయ్య మంగళవారం ఏపీ శాసనమండలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరువుపై చర్చ సందర్భంగా ఆయన కట్టు తప్పారు. అధికార సభ్యులనుద్దేశించి ఆయన మీరంతా పతివ్రతలా? అంటూ వ్యాఖ్యానించారు. రామచంద్రయ్య వ్యాఖ్యాలపై టీడీపీ మహిళా ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. రామచంద్రయ్య వ్యాఖ్యాల సందర్భంగా సభలోనే ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిండు సభలో అనుచిత వ్యాఖ్యలతో ఆడవాళ్లను అవమానిస్తారా? తక్షణమే క్షమాపణ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. రామచంద్రయ్య క్షమాపణ చెప్పేదాకా సభను జరగనివ్వబోమని ఆమె తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై ఒక్కసారిగా నిరసన వెల్లువెత్తడంతో రామచంద్రయ్య మౌనంగా తన పార్టీ సభ్యులను బయటికి తీసుకుని వెళ్లిపోవడం గమనార్హం.