ఎడం చెయ్యి కాదు పురచెయ్యి అన్నది విన్నారా? లెఫ్ట్ హ్యాండే నాట్ రైట్ హ్యాండ్! పరాయి అయితేనే ప్రతిపక్ష పళ్లు రాలగొట్టేందుకు. క్షతగాత్రమైన అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బ్యాండేజీ కట్టాలనే కోరికతో శ్రేయోభిలాషులు అందరూ గొంతు చించుకుంటున్నారు. బొంగురుపోయినా రాగం మానడం లేదు. ఈ ఒత్తిళ్ళ వాతావరణంలో తిరపతి వాస్తవ్యుడు అమాయకంగా ప్రాణాలర్పించేడు. మొత్తానికి ప్రతిపక్షాలు ఈ సన్నివేశాల్ని ఎగరేసుకుపోయే పరిస్థితి గ్రహించి కేంద్రానికి చంద్రబాబు సాధ్యమైనంత గట్టిగానే వార్నింగు ఇచ్చేడు. ఢిల్లీలో జగన్ ధర్నా ప్రత్యేక హోదా విషయాన్ని ఓటుకి నోటులాంటి అసందర్భ విషయాలు మింగేశాయి.
కేవలం ప్రత్యేక హోదా పేరున కలిగే లబ్ధి అయిదు వేల కోట్లకు మించదని దాన్ని తలదన్నే లాంటి ప్యాకేజీ ఇస్తామని ఢిల్లీ పాదుషాలు అంటున్నారు. ప్రత్యేక హోదా అనే పదం మీద, దాని వ్యుత్పత్తి అర్థం మీద వెర్రి వ్యామోహంతో తన్నుకు చచ్చే అగత్యం లేదు. హోదా పేరే ముఖ్యమా ఎవరికైనా? హోదా కాపోతే లడ్డు. లడ్డూ కాపోతే జిలేబీ. జిలేబీ కాపోతే వంకాయ్. ముందు రాష్ట్రాన్ని గట్టెక్కించే పుణ్యకార్యం తలపెడితే చాలు. అసలు మోదీ నోరు విప్పడేం... ఓట్లు వేయించుకొని ఉలుకు పలుకులేకుండా, ప్రజలకు ఉపశమనం కలిగే మాట ఏదైనా పలికితే మంచిది. వీటన్నిటికంటే ముందు విభజన పర్వం టైములోనే ఊహకందని ప్యాకేజీ ప్రకటించి ఉంటే ఇలా కొట్టుకునే అవకాశం తప్పి ఉండును. ప్రస్తుతం గాయపడిన ప్రజల మనోభావాలు ముఖ్యం!