తన డైలాగ్ డెలివరీతో 500 లకు పైగా చిత్రాలతో విలక్షణ నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మోహన్ బాబు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. టీడీపీ నేత పరిటాల రవీంద్ర బతికుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలగిన మోహన్ బాబు, పరిటాల రవి మరణానంతరం రాజకీయాలకు దూరంగా జరిగారు. తదనంతర కాలంలో సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన తాను నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ కార్యకలాపాల పర్యవేక్షణలోనే తలమునకలయ్యారు.
అయితే తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన సన్నాహాలు చేయబోతున్నాడని సమాచారం. తన జన్మదినాన్ని చిత్తూరు జిల్లాలోని శ్రీవిద్యానికేతన్ లో ఆయన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో మాట బయటపెట్టాడు. త్వరలో తిరిగి రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించారు. ‘‘ఒకప్పుడు రాజకీయంగా కొంతమందికి సపోర్ట్ ఇచ్చాను. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ అనేది అప్పుడే చెబుతా’’ అని మోహన్ బాబు ప్రకటించారు. అన్నగారి అభిమానంతో తిరిగి టీడీపీలో చేరతారా లేక రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో కూడా సంబంధాలు ఉండటంతో అందులో జాయిన్ అవతారా అన్నది సస్పెన్స్.