తెలంగాణ ఏర్పాటుకు అడ్డం తగిలి, ముక్తకంఠంతో వ్యతిరేకించిన పార్టీల్లో ఎంఐఎం కూడా ఒకటనే విషయం మనందరికీ తెలుసు. అయితే రాష్ట్ర విభజన జరగటం ఆ తర్వాత టీఆర్ఎస్ ఏకపక్షంగా అధికారంలోకి రావటం, ఆపై టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్ధతు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి కూడా. ఇక భాగ్యనగరంపై పట్టుకోసం తప్పని పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ వారికి స్నేహ హస్తం అందించింది. బహిరంగ మద్ధతు కాకపోయినా ఇప్పటిదాకా ఎక్కడా మజ్లిస్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ, అన్నదాతల ఆత్మహత్యల అంశంపై తాజా అసెంబ్లీ సమావేశాలు అందుకు వేదికగా మారాయి.
ప్రస్తుతం తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవటం, అందునా దేశంలోనే రెండో స్థానంలో రాష్ట్రం ఉండటంతో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో ధనిక రాష్ట్రమని చెప్పుకుంటన్న రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్టవెయ్యకపోవటంపై అన్ని పక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఇప్పుడు వాటితో ఎంఐఎం కూడా గొంతు కలిపింది. మంగళవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కడిగిపారేశారు. రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉదాశీన వైఖరితో పాటు విపక్షాల బాధ్యతారాహిత్యాన్ని కూడా ఎండగట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యల సంఖ్యను ప్రస్తావించిన అక్బరుద్దీన్, వాటిని నిలువరించేందుకు ఏం చేశారని నిలదీశారు. ఆత్మహత్యల పాపమంతా ప్రకృతిదేనంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన ప్రశ్నించారు. ఆత్మహత్యలపై ఏటా చర్చించుకోవడం తప్ప ప్రజా ప్రతినిధులు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు.
అయితే ప్రభుత్వం పై ఆయన అలా విరుచుకుపడటంలో కారణం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం వ్యతిరేకించటంతో మండిపోయిన అక్బరుద్దీన్ ఈ రేంజ్ లో ప్రభుత్వంపై ఫైర్ అయినట్లు వారంటున్నారు. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ సమయంలో ప్రతిపక్షం, విపక్షాలు కూడా ఏవీ గొంతు పెకిలించలేదు దీంతో ప్రస్తుత అక్బరుద్దీన్ వాగ్ధాటికి అవి కూడా బలైయ్యాయని వారి అభిప్రాయం.