ప్రస్తుతం దేశం మొత్తం జరుగుతున్న డిస్కషన్ బీహార్ ఎన్నికల గురించే. మోదీ హవాకు చెక్ పెడుతూ బీహార్ లో బీజేపీని లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతో చేతులు జనతా పరివార్ ను ఏర్పాటుచేశారు. నితీశ్, లాలూల లక్ష్యం ఇప్పుడు అక్కడ బీజేపీ లేకుండా చెయ్యాలనే. ఇక వీరి విమర్శలకు ధీటుగా బదులిస్తూ వరుస ర్యాలీలతో గట్టి పోటినిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో నితీశ్, లాలూలు ఎంతటి ఆరోపణలకైనా దిగుతున్నారు.
లాలూ అయితే ఓ మెట్టు దిగి మరీ కుల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో ఆసక్తికర కామెంట్లు చేశారు. అసలు బీహార్ ఎన్నికలు వెనుకబడిన, ఉన్నత కులాల మధ్య పోరు’ అంటూ బాంబు పేల్చాడు. దీంతో లౌకిక కూటమి, ఎన్డీయే కూటమికి మధ్య మాటలయుద్ధం ఊపందుకుంది. అదే టైంలో ఓబీసీ కులాల వారు ఏకమై తమ కూటమికే ఓట్లు వేయాలంటూ లాలూ కోరారు. ఇక ఈ మాటలపై రాజకీయ దుమారం చెలరేగింది. లాలూ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ హితవుపలికారు. ఓట్ల కోసం కుల రాజకీయాలకు తెరదీసే సంస్కృతి వారిదంటూ మండిపడ్డారు. ఎన్డీయే అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఆ కామెంట్లను లైట్ తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే లౌకిక కూటమి వాదన మరో విధంగా ఉంది. వెనుకబడిన కులాల వారిని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే లాలూప్రసాద్ యాదవ్ అలా మాట్లాడారంటూ ఆ కూటమి నేతలు మద్ధతుపలికారు. దీంతో లాలూ వ్యాఖ్యలను ఏవిధంగా తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
నిజానికి బీహార్ లో కుల రాజకీయాలు కొత్తేమీ కాదు. బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి పార్టీలు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చెయ్యాలని జనతాపరివార్ కూటమి, మరోపక్క ఈ గెలుపుతో తమ ప్రాభవ్యం తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ ఆరాటపడుతున్నాయి. ఇక ఆటలో అరటిపండులాగా వామపక్షాలు తమ జోరును చూపిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నాయి. ఇలా ఎవరి దారి వారిదే అన్న తరుణంలో గెలుపుపై స్పష్టత లేని పరిస్థితి బీహార్ లో నెలకొంది.