ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మరో ఐడియా సమాజాన్నే దుంపనాశనం చేసేస్తుంది. హిట్లరు మహనుభావుడికి వచ్చిన ఆర్యజాతి సిద్ధాంతపు ఐడియా లక్షలాది అమాయకుల ఉసురు తీసింది. అలాగే కీచకుడికి రావణుడికి వచ్చిన పోయే కాలం ఐడియాస్ వారికి తిరు క్షవరం చేసి వదిలేయి. ఇవన్నీ చెత్త అయిడియాస్. కానీ, చెత్త లేకుండా చెద్దామనే అయిడియా వండర్ ఫుల్.
ఈరోజు హాట్ అయిడియా చీప్ లిక్కరు. దీనికి పురుడు పోసి గుడుంబాకి బొందపెట్టే అయిడియా మీద ప్రతిపక్షాలకి సమాజశ్రేయాభిలాషులకీ బోలెడంత కాలక్షేపం. జనాభా నిష్పత్తిని దృష్టిలో పెట్టుకుని సారాయి దుకాణాలు ఏర్పాటు చేసే అయిడియా ను సంఘటిత స్త్రీశక్తులు చీల్చి చెండాడుతున్నాయి. సమాజంలో దామాషా ప్రతిపాదికన ఎంతమంది రోగులకు అవసరమైన వైద్యులున్నారు? పోలీసులున్నారు? ఆఖరికి పెళ్లి కూతుళ్లకి వరులున్నారు? ఇవన్నీ శేష ప్రశ్నలే మరి. అత్యంత ఖరీదైన స్కాచ్ తాగిన దేవదాసుకి లివరు నాశనం కాలేదా? చవకబారు గుడుంబా తీర్థం పుచ్చుకున్నా అదే ఫలితం గురూ!