కోతి పుండు బ్రహ్మాండం... అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు సంక్లిష్టంగా మారి అనేక మందిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ప్రస్తుతం కామ(కాల్ మనీ ) కుంభకోణం అక్కడ పెద్ద సంచలనం. ముఖ్యంగా అధికారపక్ష నేతలే ఇందులో ఇరుక్కుని ఇబ్బందుల పాలవుతున్నారు. 2015 లో ఏపీ పలు కీలక స్కాంలకు, వివాదాలకు నెలవుగా మారింది. నేతలు, బడా బాబులు చేసిన తప్పుల్లో సామాన్యులు, అమాయకులు ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితం నేతలు తప్పించుకుని, ఏ పాపం చేయని వారు బాధితులుగా మారుతున్నారు. ఇక ఈ సంవత్సరంలో జరిగిన వివిధ సంఘటనలను గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాల్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో అందరూ అమాయకులే అంటూ చేసిన ఆ పోస్ట్ మీరు చదవండి...
పంటపొలాలు తగలబెడితే అధికారులు అమాయకులే!
గతేడాది చివర్లో నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని రెండు మండలాల్లో జరిగిన అగ్నిప్రమాదంపై అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహించటంతో అధికారుల పాత్రపై కూడా పలు అనుమానాలు రేకెత్తాయి. అయితే అధికారులు మాత్రం తాము అమాయకులమంటూ వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. అగ్నిదేవుడిని నిందితుడిగా మార్చేశారు.
ఎమ్మార్వో వనజాక్షి కేసులో చింతమనేని అమాయకుడు!
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మహిళా తహసీల్దార్ పై చేసిన దాడి. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆయన ముందుగా ఆర్‌ఐపై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని వచ్చిన మహిళా తహసీల్దార్‌పై విచక్షణారహితంగా దాడి చేయించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా నిల్చున్న ఆమెను దుర్బాషలాడారు. ఆమెను తీవ్రంగా కొట్టించి, ఇసుకలో లాగించి పక్కన పడేయించారు. ఈ ఘటనలో ఆయన అమాయకుడంటూ ఫన్నీ పోస్ట్ చేశారు.
రిషితేశ్వరి కేసులో బాబూరావు అమాయకుడు!
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు తెలిసిందే. నాగార్జున యూనివర్సిటీకి చెందిన రితేశ్వరి సీనియర్ల ర్యాగింగ్ కోరలకు బలైపోయింది. కాలేజీ జరుగుతున్న ర్యాగింగ్ ను కట్టడి చేయకపోవటంతోపాటు నిందితులకు పరోక్షంగా సహకరించాడంటూ ప్రిన్స్ పాల్ బాబురావును డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.
ఓటుకు నోటులో బాబుసహా రేవంత్ రెడ్డి అమాయకులే!
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన స్కాం. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ లైవ్ లో పట్టుబడటంతోపాటు ఇందులో ఏపీ ముఖ్యమంత్రి పేరు కూడా బయటికి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా చంద్రబాబుకు మనశ్శాంతితోపాటు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
జాబ్ కోసం లంచం తీసుకున్న పీతల అమాయకురాలే!
టీచర్ ఉద్యోగం కావాలంటే పది లక్షలు ముట్టజెప్పాలంటూ స్వయానా ఏపీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఓ అభ్యర్థి ఏకంగా సొమ్మును ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లారు. అయితే తనకేం తెలియదని, తన ప్రతిష్టను రోడ్డుకీచ్చేందుకే ఎవరో కావాలనే ఇలా చేశారని ఆమె చెప్పారు.
బొండా ఉమ తనయుడు కూడా అమాయకుడే!
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులోఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఈ వ్యవహారానికి మూల కారణం అధికార పక్ష ముఖ్య నేత బొండా ఉమ తనయుడు సిద్ధార్థనే అని అందరికీ తెలుసు. బొండా తనయుడి కార్ల రేసు మోజులో జరిగిన ప్రమాదంలో అమాయక యువకుడు బలైపోయాడు. ఘటన జరిగిన తర్వాత సిద్ధార్థ పరారీలో కూడా ఉన్నాడు. అయినా తన తనయుడి తప్పేం లేదని బొండా వాదిస్తూ వస్తున్నాడు. మరి ఆయన చెబుతున్నాడంటే అమాయకుడే అయి ఉంటాడేమో.
ఇంతమంది అమాయకుల మధ్యలో కాల్ మనీ అక్రమాలకు పాల్పడిన నేతలు కూడా అమాయకులు కాకుండా పోతారా? అన్న ప్రశ్న షేరింగ్ మీద షేరింగ్, లైక్ ల మీద లైక్ లతో ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. మొత్తానికి ఈ ఏడాది అక్కడ అంతా అమాయకులే వార్తల్లో నిలిచారు.