ఓటుకు నోటు తర్వాత రాజకీయ పరిణామాలు ఎటు వెళ్తున్నాయో ఎవరికీ అర్థం కాకుండా పోతున్నాయి. ఓ వైపు నేతల మధ్య మాటల తూటాలే అనుకుంటే గవర్నర్ నరసింహన్ పై తెలుగుదేశం నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. గవర్నర్ అని లెక్క చేయకుండా గల్లీ నేతలు సైతం గవర్నర్ పై పరుష పదజాలంతో విరుచుకుపడటం మరీ దారుణం. ఇక గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై ఓ వైపు నరసింహన్ తో పాటు, మరోవైపు కేంద్రం కూడా మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గవర్నర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ మంత్రులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఎవరూ గవర్నర్ ను విమర్శించవద్దని, కించపరిచేలా వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. కాగా మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గంగిరెద్దు అని కాస్త ఘాటైన పదాలతో వారు గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో రంగంలోకి దిగిన బాబు మంత్రులు, టీడీపీ నేతలు గవర్నర్ పై వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. మరీ ఇంత అడ్డగోలుగా మాట్లాడాక ఎన్ని చర్యలు చేపట్టినా లాభమేంటి. జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా...