తెలంగాణ వర్సెస్ ఏపీ నీటి పంచాయితీ సుప్రీం కోర్టు గడపను తాకింది. మొండిపట్టుతో తెలంగాణ సర్కారు కట్టి తీరుతానంటున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వ్యవహారంపై ఏపీ రైతులు సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ప్రాజెక్టులపై నిన్నటిదాకా ఏపీ, తెలంగాణ రాజకీయ నేతల మధ్య మాత్రమే మాటల తూటాలు పేలితే, తాజాగా ఆ సీన్లోకి ఏపీ రైతులు వచ్చి చేరారు. తెలంగాణ ప్రభుత్వం కట్టి తీరుతామంటున్న ఈ రెండు ప్రాజెక్టుల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో శుక్రవారం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలు విషయాల్లో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. అయితే నీటికి సంబంధించిన అంశాలను విభజన సమయంలోని చట్టంలో ఆయా ట్రిబ్యునల్స్ కి అప్పజెప్పటం వల్ల ఇప్పుడు కూడా ఈ విషయంలో సుప్రీం జోక్యం చేసుకోబోదనే న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.