కేంద్రంలో ప్రధానినే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రుల ఏడాది పాలనపై కాంగ్రెస్ వ్యంగ్యాస్రాలు సంధిస్తుంది. జాతీయ స్థాయిలో మీటింగ్ లు పెట్టి మరీ మోదీ ప్రభుత్వాన్ని వాయిస్తున్న ఆ పార్టీ చూపు మన సీఎంలపై కూడా పడింది. అందుకు ప్రాంతీయ ప్రతినిధులను ఉపయోగించుకుంటోంది. తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అధికార తెలుగుదేశం పై విసుర్లు విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ ఓ సీడీని రిలీజ్ చేసింది. అదిరిందయ్యా చంద్రం పేరుతో ఈ సీడీని విడుదల చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క వాగ్ధానాన్ని కూడా అమలు చేయకుండా సాగిన పాలన చంద్రబాబు ప్రభుత్వానిదని. ఏం ఒరగబెట్టారని మహానాడు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. మహానాడు అని కాకుండా మహా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం పై పోరాటం తాలుకు శాంపిల్ మాత్రమే అని పేర్కొన్నారు. పార్టీ పరిస్థితి ఏమోగానీ ఇలాంటి విమర్శలకేం తక్కువ లేదని అక్కడి విచ్చేసిన కొందరు పెద్దలు గుసగుసలాడుకోవటం కొసమెరుపు.