ఎక్కడ ఎన్డీయే ప్రభుత్వం, ఎక్కడ కాంగ్రెస్. నిరంతరం ఆరోపణ, ప్రత్యారోపణలతో విరుచుకుపడే ఈ రెండు పార్టీలు కీలకమైన బిల్లుల విషయంలోనే సహకరించుకోవట్లేదన్నది తెలిసిందే. సందు దొరికితే మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడే రాహుల్ ను కీలకమైన బడ్జెట్ లో హ్యాండ్ పెట్టనిచ్చారంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా. కానీ, అదే జరిగింది. సోమవారం ఉదయం బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు ఓ విలువైన సూచన చేశారని, మరో ఆలోచన లేకుండా దాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారంట. కనుచూపులేనివారు వినియోగించే బ్రెయిలీ పేపరును అన్ని రకాల సుంకాల నుంచి మినహాయించాలని ఆయన కోరారని, దీంతో సుంకాలు తొలగిస్తున్నామని ఆయన అన్నారు. బ్రెయిలీ పేపరుపై సుంకాల తొలగింపుతో ఈ రకం పేపర్ ధర 25 నుంచి 30 శాతం వరకూ తగ్గనుంది. మిగతా ప్రతిపాదనల సమయంలో మౌనంగానో లేదా నినాదాలు చేస్తూనో స్పందించి, రాహుల్ ని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసేసరికి టేబుళ్లపై చేతులతో చరుస్తూ మద్దతిచ్చారుంట కాంగ్రెస్ సభ్యులు.