ఓవైపు దేశమంతా ఉగ్రదాడులతో వణికిపోతున్న సమయంలో, వారి పైశాచికానికి ప్రాణాలు పోతున్న పరోక్షంగా వారికే మద్ధతు ప్రకటించిన ఘనత మజ్లిస్ పార్టీది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్, మక్కా మసీద్ పేలుళ్ల లో వందల జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితుల ప్రాణాలకు విలువనిచ్చిన ఘనత ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీది. వారిని చంపటం వెనుక మతరంగు పులిమి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఆయనకు పరిపాటే. అయితే ఇప్పుడు ఆయన మనసు మారిందట. పారిస్ ఘటన ఇప్పుడు ఆయనను తీవ్రంగా కదిలించిందట.
ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులతో ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం పాతబస్తీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎస్ దాడులపై విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఐఎస్ ముష్కరులు విశ్వవ్యాప్తంగా లక్షన్నర మంది ముస్లింలను పొట్టనబెట్టుకున్నారని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఇస్లామిక్ స్కాలర్లు ఐఎస్ ఉగ్రవాదులపై ఫత్వా జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ లలోని పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటున్న ఐఎస్ ఉగ్రవాదులు బరితెగిస్తున్నారన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఐఎస్ ఉగ్రవాద సంస్థను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఎస్ ఉగ్రసంస్థ ద్వారా మొత్తం ఇస్లాం మతానికే చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఎంతైనా ఇలాంటి ఘాటు మాటలు అసదుద్దీన్ నోటి వెంట రావటం ఆశ్చర్యకరమే కదా.