వైఎస్ జగన్ కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలుకానుంది. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం ఆయన అక్కడికి వెళ్లాడు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న కేసీఆర్ పై ఆయన ఏం విమర్శలు చేస్తారనే? నిజానికి వీరిద్దరు మిత్రపక్షాలు కాకపోయినా పరస్పర అవగాహనతో కొనసాగుతూ వస్తున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వీరిద్దరు అసలు విమర్శలు చేసుకోవటం లేదు. దీంతో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తి నెలకొంది. తన పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశ్ కు మద్ధతుగా ప్రచారం చేయనున్నారు.
కేసీఆర్ పాలనలోని లోపాలను జగన్ ఎత్తిచూపుతారా లేదా అన్నది ప్రశ్నే. జగన్ కొత్త వివాదాల జోలికి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టవచ్చని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ పై గనక విమర్శలు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నాడట. ఇక జగన్ పర్యటనను కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ యాత్రగా విమర్శిస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కేసీఆర్ పై మాటల తుటాలు పేల్చకపోతే ఆ విమర్శలకు మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి జగన్ ఏం చేస్తారో...