బయోపిక్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఎంతో మనకు తెలియంది కాదు. ప్రస్తుతం దేశం అంతటా వాటి హవానే నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, ఆఖరికి డాన్ ల జీవిత చరిత్రలు కూడా వచ్చాయి... వచ్చేస్తున్నాయి కూడా. ఇంతకాలం ఉత్తరాదికే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్ కి కూడా పాకనుంది. ప్రస్తుతం తెలుగులోనూ ఆ శకం మొదలుకానుంది. మొన్ననే బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి అంటూ చరిత్రకు సంబంధించిన ఓ కథకు రెడీ అయ్యాడు. ఇక ఇప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర వంతు వచ్చింది. కొంతమంది ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
నిజానికి గత రెండు సంవత్సరాలుగా కేసీఆర్ జీవిత చరిత్రకు సంబందించిన ముఖ్యమైన ఘట్టాలను ఎంపిక చేసుకోవటం, అందుకు రీసెర్చి, పలువులను కలవటం, వాటిని క్రమ బద్దతిలో పెట్టుకుని, స్క్రిప్టు గా మలచటం వంటి పనులు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైందని, అయితే కేసీఆర్ గా కనిపించే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని, అది పూర్తి కాగానే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. అయితే జూన్ 2 తెలంగాణా అవతరణ దినోత్సవం రోజున చిత్ర ప్రకటన జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఈ బయోపిక్ లో తెలంగాణా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు, మైలురాళ్లు ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది.