బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి బెంగళూరులో ప్రారంభం అవుతున్నాయి. రెండురోజులు జరిగే ఈ సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడమే ముఖ్య ఉద్దేశంగా తమ ఎజెండాలో పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ సమావేశానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకోనున్నారు. ఆయన మూడు రోజులు బెంగళూరులోనే ఉంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. గురువారం ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నూతన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుంది. మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కార్యవర్గ సమావేశాల్లో సభ్యులతో పాటు జేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శాసనసభా పక్ష నేతలతో కలిపి మొత్తం 330 మంది పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని నేషనల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ నేత మురళీధర్ రావు తెలిపారు.