పవన్ మావాడే అంటున్న బీజేపీ

May 11, 2016 | 10:54 AM | 4 Views
ప్రింట్ కామెంట్
pawan-kalyan-supports-to-bjp-niharonline

రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యే సమయంలో తెలుగుదేశం పార్టీ కంటే ముందే బీజేపీతో సంబంధాలను కొనసాగించాడు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ముందుగానే ప్రధాని అభ్యర్థి మోదీని కలిసి చర్చలు జరిపారు. ఆపై ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున బాగా ప్రచారం చేసి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటానికి తన వంతు సాయం చేశారు.  ప్రస్తుతం ప్రత్యేకంపై టీడీపీపై విరుచుకుపడుతున్నాడే కానీ, కేంద్రంలో అధికారంలో ఉండి, సమస్య పరిష్కరించగలిగే బీజేపీని మాత్రం పన్నెత్తి మాట అనటం లేదు. మాట నిలబెట్టుకోవాలి అని సున్నితంగా మందలిస్తున్నాడే తప్ప, ఎక్కడా పరుష పదజాలం వాడటం లేదు.

                         ఇదిలా ఉంటే మిత్రపక్షం అయిన టీడీపీ ఘాటు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తోంది. ప్రత్యేకం పేరుతో మోసం చేసిదంటూ మంత్రులతో సహా అంతా విరుచుకుపడుతున్నారు. దీనిపై బీజేపీ కౌంటర్ వేసింది.  హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి టీడీపీ పై నిప్పులు చెరిగారు. అసలు తమతో పొత్తు పెట్టుకోమని తామెవరినీ పిలవలేదని ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి కాస్తంత వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు లేకుంటే... టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదని కూడా ఆయన తేల్చేశారు. ‘‘ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించగానే, ఆయనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నాయకులే పొత్తు కోసం మా వెంటపడ్డారు. ఇక పవన్ బీజేపీకి నిజమైన స్నేహితుడు. అసలు పవన్ కల్యాణ్ మద్దతు లేకుండా అసలు ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల బరిలో దిగనుందని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ కూటమి గనక విడిపోతే ఆయన మద్ధతు టీడీపీకి ఉంటుందా? లేక మా మిత్రుడే అని చెప్పుకునే బీజేపీకి ఉంటుందా? చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ