ఎవరైనా అధికారులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తే చాలు వారిపై విరుచుకుపడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ప్రతీష్టాత్మకంగా తీసుకున్న పథకాల విషయంలో జరిగే అవకతవకలను ఆయన మరీ సీరియస్ అవుతున్నారు. చిన్న చిన్న విషయాలైనప్పటికీ ఇప్పుడు వాటిని వదిలేస్తే భవిష్యత్ లో అవి ముదిరే ప్రమాదం ఉందన్నదే ఆయన భయం. ప్రస్తుతం ఏపీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లకు ‘చంద్రన్న కానుక’ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే సదరు కానుక కింద ఎంపిక చేసిన సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. ఈ సరుకుల్లోని గోధుమ పిండిలో తవుడు వచ్చిందని విజయనగరం జిల్లాకు చెందిన బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంపై జిల్లా అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ పిండిలో తవుడు వచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు, దానిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులు ఎవరైనా సరే వదిలాల్సిన ప్రసక్తే లేదని, తేడాలోస్తే మీపై పడతానని ఆయన అధికారులకు హెచ్చరించారంట.