ఇరుదేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్న వేళ అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసి మన అధికారులకు మట్టుపెట్టారు జైషే మహ్మద్ ఉగ్రవాదులు. అలర్ట్ గా ఉన్నామని భారత సైన్యం చెబుతున్నప్పటికీ పక్కా ఫ్లాన్ తో వచ్చిన వారు భారీ నష్టానికే దిగినట్లు తెలుస్తోంది. కాల్పులు ముగిసినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అయితే ఇప్పటిదాకా ఉగ్రవాదులు ఆరుగురు చనిపోగా, సైనికాధికారులు 7 మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇక అసలు ఈ దాడులు ఎందుకు అనే అంశంపై ఓ ప్రముఖ జాతీయ జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనం ఇదే...
రష్యా, అప్ఘనిస్థాన్ ల పర్యటన ముగించుకుని కాబూల్ నుంచి మరికాసేపట్లో మోదీ ఢిల్లీకి చేరుకోవాల్సింది. సడన్ గా ఓ రెండు గంటల ముందు ఉన్నట్టుండి షెడ్యూల్ మారిపోయింది. కాబూల్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన మోదీ విమానం నేరుగా పాకిస్థాన్లోని లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. విమానాశ్రయానికి స్వయంగా వచ్చిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విమానం దిగిన మోదీకి ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ఓ హెలికాఫ్టర్ లో ఎక్కిన ఇద్దరు నేతలు నేరుగా నగర శివారులోని నవాజ్ ఇంటికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న నవాజ్ మనవరాలి పెళ్లికి మోదీ హాజరయ్యారు. నవాజ్ తల్లికి పాదాభివందనం చేశారు. రెండు గంటల పాటు అక్కడ ఉన్న ప్రధాని తిరిగి ఢిల్లీ వచ్చేశారు. ఈ పర్యటన ఇరు దేశాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగానూ పెద్ద చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఐక్యరాజ్యసమితి కూడా మోదీ పర్యటనను కీర్తించింది. పాకిస్థాన్ లోనూ మెజారిటీ వర్గం మోదీ సాహసాన్ని స్వాగతించింది.
అయితే, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కు మాత్రం ఈ పర్యటన మింగుడు పడలేదుట. అంతే, వెనువెంటనే పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులతో ఆయన మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో విధ్వంసకర దాడి చేయాలని తీర్మానించారు. తద్వారా ఇరు దేశాల మధ్య నెలకొంటున్న సత్సంబంధాలను దెబ్బతీయాలని ఆయన ఐఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ చీఫ్ ఆదేశాల ప్రకారం ఐఎస్ఐ... ఉగ్రవాద సంస్థ జైషె మొహ్మద్ ను రంగంలోకి దించింది. పాక్ లోని రావల్పిండిలో దాడికి సంబంధించి పక్కా ప్లాన్ రూపొందింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను చెడగొట్టడమే కాక పనిలో పనిగా భారత్ కు పెను నష్టాన్ని కలిగించేందుకు ఉగ్రవాదులు రంగంలోకి దిగిపోయారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డారు... అంటూ ఓ కథనం ప్రసారం చేసింది.