ర్యాలి గ్రామంలో రీతీ రివాజు లేని అధికారుల నిర్వాకం!

July 02, 2015 | 06:15 PM | 11 Views
ప్రింట్ కామెంట్
encrochments_in_rally_village_east_godavari_niharonline

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామం. సుప్రసిద్ధ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం పురాతన కాలం నుండి భక్తుల అభిష్టాలను తీర్చేదిగా పేరుగాంచింది. భక్తుల మాట దేవుడెరుగు, స్థానిక గ్రామస్థులకు పుష్కరాల పేరు చెప్పి చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ప్రాణ సంకటంగా మారి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వాధికారుల అత్యుత్సాహంతో ర్యాలి గ్రామస్థులు తమ కళ్ల ముందే తమ పూర్వీకులు నిర్మించిన గృహ సముదాయాలను ధ్వంసం చేస్తుండటంతో ప్రజానీకం ధర్మాగ్రహంతో ఊగిపోతూ దిక్కుతోచని స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణ ప్రదంగా చూసుకునే ఇళ్లు వాకిళ్లను సంరక్షించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేసిన గ్రామస్థురాలు, 85 సంవత్సరాల బోడా కమలావతి ఈ సందర్భంగా తన ఆవేదనను వెళ్లగక్కారు. ఒంటరిగా నివసిస్తున్న తనను ఈ వయస్సులో కష్టాల పాలు చెయొద్దని అధికారులకు విన్నవించినా వారి ధ్వంస రచనను నిలువరించే నాథుడే కరువయ్యాడు. ప్రజా సౌకర్యం దృష్ట్యా ఆటంకంగా ఉన్న నిర్మాణం ఏదైనా ఉంటే,  తమంత తామే తొలగించేందుకు సిద్ధమని వివరించిన అధికారులు పెడచెవిన పెట్టారని ఆమె వాపోయారు. ముందస్తు సమాచారం లేకుండా, దౌర్జన్యంగా జరుపుతున్న ఈ విధ్వంసం నిలువరించాలని, విస్తరణ పేరుతో చక్కగా ఉన్న రోడ్లను నాశనం చేస్తున్నారని గ్రామస్థులు గుండెలు బాదుకుంటున్నారు. పుష్కరాలు అతిచేరువలో ఉండగా ఆదరా బాదరాగా ఈ కార్యక్రమం చేపట్టడంలో ఆంతర్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రూల్ ప్రకారం 14 రోజుల ముందుగా ఆక్రమణలను గుర్తించి, మార్కింగ్ చేసిన తర్వాతనే తొలగింపు చర్యలు చేపట్టాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ దుర్మార్గపు చర్యను, దీనికి ప్రధాన సూత్రధారులను బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించిన తర్వాతే ఈ కార్యక్రమానికి దిగామని అధికారులు చెబుతున్నప్పటికీ అదంతా బూటకమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరును ఎండగడుతూ గ్రామస్థులు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్ధులవుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ