ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ చేయడం ఆనవాయితీ. దర్శకుడు, హీరో, మ్యూజిక్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు అంచనాకి వస్తుంటారు. ఓరి దేవుడో మహేష్ బాబు పిక్చరా, పూరీ డైరక్షనా, ఇలాంటి లెక్కలతో బుల్లి సినిమా నిర్మాతలు బెంగపెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కూడా బ్రహ్మ ప్రళయమయిపోతోంది. మనకి ఉన్న జ్నానం కొద్దీ బాలీ ఉడ్, టాలీ ఉడ్, కోలీ ఉడ్, హాలీ ఉడ్, అనే మాటలే తెల్సు. కొద్ది మంది డైరక్టర్ల పేర్లు తెల్సు. కానీ, వీళ్లందరినీ మించిన తురుంఖాన్ ఢిల్లీలో ఉన్నారు. దానిపేరే ఢిల్లీ ఉడ్. అక్కడ ఢిల్లీ ఉడ్ లో కొమ్ములు తిరిగిన దర్శకురాలు సుమిత్రా మహాజన్ అనే పేరుగల విదుషీమణి లోక్ సభ స్టూడియో నుంచి యావద్భారత దేశం ఒకేసారి రిలీజ్ చేసి అన్ని సినిమాలు దుకాణం సర్దేసుకునిపోయే నిర్ణయం తీసుకున్నారు.
లోక్ సభలో జరిగే వీనుల విందైన కత్తియుద్ధాలు, భయంకరమైన యుగళ గీతాలు, మున్నగు చమత్కార చలన చిత్రాల్ని మన ఇంట్లో నే కూర్చుని ఏ విధమైన సీరియళ్లు, సినిమాలు చూడఖ్కర్లేకుండా పైసా ఖర్చులేకుండా చూసి తరించే మహద్భాగ్యం కలిగిస్తున్నారు. మరి మన అభిమాన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఏమయిపోతారో ఏమో మరి? లోక్ సభ నుంచి టెలికాస్టు అయ్యే గేవా కలరు సినిమాలకి ఏ విధమైన సెన్సారు అభ్యంతరాలు ఉండకూడదని సుమిత్రమ్మ ఒక మంచి నిర్ణయం కూడా తీస్కోన్నారు.