ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మాటేమో గానీ, అసలు ప్యాకేజీపై, ఇతర ఆర్థిక సాయంపై కూడా ఇంతవరకు కేంద్రం నుంచి స్పష్టత రాలేదని విమర్శలు చెలరేగాయి. దీనిపై కేంద్రం బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రకటన చేసినప్పటికీ అది ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. ఇక ఆంధ్ర నేతలు కూడా నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉండటంతో మంట తారాస్థాయికి చేరింది. కనీసం కేంద్ర స్థాయిలో మంచి సంబంధాలున్న నేతలు కూడా హోదాపై గానీ, ప్యాకేజీపై గానీ స్పందిచకపోవటం ఆరోపణలు వచ్చాయి. పదవులు అనుభవిస్తున్న వారు కూడా అక్కడ ఏం పొడుస్తున్నారంటూ ప్రతిపక్షాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. అయితే అలాంటి తరుణంలో ఈ రెండింటిపై మాట్లాడటంతోపాటు, ప్రతిపక్షాలను ఘాటైన సమాధానాలిచ్చిన ఏకైక వ్యక్తి సుజనా చౌదరి మాత్రమే.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి గతంలో పలుమార్లు చేసినప్పటికీ ఇప్పటిదాకా వాస్తవరూపం దాల్చలేదు. తాజాగా గురువారం కూడా అలాంటి పనే చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ మినహా మిగిలిన వాటికి ఆర్థిక సాయానికి సంబంధించి సాయంత్రంలోగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆయన ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, ఆర్థిక లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీపై సాయంత్రంలోగా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని కరాఖండిగా చెప్పారు. అయితే ముందులాగే ఇది కూడా బూచే అని అంత లైట్ తీసుకోగా, కేంద్రం సాయంత్రానికి నిజంగానే ప్రకటన జారీ చేసింది. ఏపీకి రూ.1,100 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైంది. ఇందులో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.400 కోట్లను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చివరికి సుజనా చెప్పిందే జరిగింది సంతోషం.