ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 విధిస్తారన్న వార్తలతో ఇప్పుడు రెండు తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డ తర్వాత ఈ సెక్షన్ శరవేగంగా బయటకు తెచ్చారు. దీనిని అనుసరించే రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య లేకుండా ఈ సెక్షన్ ను అమలు చేయోచ్చని అటార్నీ జనరల్ గవర్నర్ నరసింహన్ కు సూచించారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ లోని శాంతి, భద్రతలు మరియు పాలనా పరమైన అంశాలపై గవర్నర్ కే పూర్తి బాధ్యత ఉంటుంది. దీనికి సంబంధిత ప్రభుత్వాలను సంప్రదించినప్పటికీ వాటికి సూచనలను గవర్నర్ పాటించవచ్చు, లేకపోవచ్చు. నోటుకు ఓటు వ్యవహారంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ నే టాప్ చేశారని, దీని ద్వారా తెలంగాణ నిఘా వ్యవస్థ ఎంత తప్పుడు చర్యలకు పాల్పడుతుందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిజానికి సెక్షన్ 8 విభజన రోజు నుంచే అమలులోకి రావాలి. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చతురతతోపాటు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పాలనను లైట్ తీసుకోవటంతో అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక తాజా ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందు ఈ సెక్షన్ ను తీసుకొచ్చింది. ఖచ్చితంగా పదేళ్లపాటు గవర్నర్ కు హైదరాబాద్ పై అధికారాలు కట్టబెట్టాలని వాదిస్తోంది. అనవసర జోక్యం ఎందుకు లే అనుకున్న కేంద్రం పరిస్థితి మరింత విషమించకముందే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అయితే సాధారణంగానే ఇది తెలంగాణ లో సెగలు పుట్టిస్తోంది. మరోవైపు సెక్షన్ 8 గనుక అమలు చేస్తే జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని టీఆర్ఎస్ ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించినట్లు సమాచారం. సెక్షన్ 8ను ఉపయోగిస్తూ హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించేందుకు సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎలాగైనా సరే సెక్షన్ ను అమలు అయ్యేలా చూసేందుకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా తీవ్ర కృషి చేస్తోంది. ముఖ్యంగా ఓటుకు వ్యవహారంలో గవర్నర్ పక్షపాత ధోరణితో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించారని బహిరంగంగానే విమర్శలకు కూడా దిగింది. ఈ విషయంలో అవసరమనుకుంటే కేంద్రంలో ఉన్న తమ మంత్రుల సహాయం తీసుకుని ఒత్తిడి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నోటుకు ఓటు వ్యవహారంలో అడ్డంగా దొరికి బయటపడే మార్గంలేక ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యను ఆంధ్ర ప్రజల సమస్యగా సృష్టిస్తున్నాడని, ఈ వ్యవహారంతో ఇరు రాష్ట్రాల మధ్య మరింత చిచ్చుపెట్టేలా కనిపిస్తోందని మరి కొంతమంది వాదిస్తున్నారు. అసలు ఓటుకు నోటు వ్యవహారంతో సంబంధంలేని గవర్నర్‌ను, సెక్షన్ 8ను తెరపైకి తెచ్చి సీన్ క్రియేట్ చేస్తే సమస్య జఠిలమవ్వటమే తప్ప పరిష్కారం అయ్యే ఛాన్స్ ఒకింత కూడా లేదని రాజకీయ విశ్లేషకుల వాదన. తీవ్రత తగ్గుతున్న సమయంలో ఇలాంటి వితండవాదాలు మరిన్ని తెరపైకి తెచ్చి ఒకరినొకరు విమర్శలు చేసుకోవటం రాజకీయ నాయకులకు పరిపాటే కదా.