ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆచూకీ అంతుచిక్కడం లేదు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో ఉన్నానని, పది రోజుల తర్వాత విచారణకు హాజరవుతారని ఏసీబీ అధికారులకు ఆయన లేఖ రాశారు. ఆస్పత్రికి వచ్చినా విచారణకు సహకరిస్తానని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే తాను ఏ ఆస్పత్రిలో ఉన్నానన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాదు రోజుకో ప్రదేశం మారుతూ ఆయన ఏసీబీకి మస్కా కొడుతున్నారు. లేఖ రాసే సమయానికి సండ్ర రాజమండ్రి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే శనివారం మధ్యాహ్నం దాకా ఆ ఆస్పత్రిలోనే ఉన్న సండ్ర, సడన్ గా అక్కడి నుంచి కూడా అదృశ్యమయ్యారట. ఒకవేళ విచారణ కోసం ఏసీబీ అధికారులు అక్కడికి వచ్చినా కూడా వారికి దొరకకూడదనే ఐడియాతో సండ్ర ఇలా తప్పించుకు తిరుగుతున్నారని సమాచారం.