ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరి ఎలా ఉన్నా ఏపీ నేతలు మాత్రం చాలా ఆశతో ఉన్నారు. బీహార్ లా ప్యాకేజీ భారీ ప్యాకేజీ కాదని, అదనంగా ప్రత్యేక హోదా కూడా ఇచ్చి కచ్ఛితంగా కనికరం చూపుతుందని వారు చెబుతున్నారు. ప్రత్యేక హోదా పక్కా అని ఊరిస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్నానం శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి మరోసారి ఈ విషయం పై స్పందించారు.
ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ కాదు. స్పెషల్ స్పెషల్ స్టేటల్ ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నింటి కోసం తామంతా ప్రయత్నిస్తున్నామని సుజనా చెప్పుకొచ్చారు. మొన్నటిదాకా ప్రత్యేక హోదా పై ఎటూ తేల్చని వీళ్లు వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఓవైపు మోదీ బాబు భేటీ జరుగుతుండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా ఓ కలగానే మిగిలిపోతుందనేది సుజనా మాటల్లో అర్థమైంది.