పరమ పావన చాలీసా

August 24, 2015 | 05:34 PM | 4 Views
ప్రింట్ కామెంట్
pawan_kalyan_interaction_with_tullur_people_niharonline

వీరాంజనేయులకి తనశక్తి తనకు తెలియదని పౌరాణిక ప్రవచనం. రాజధాని నిర్మాణ బాధితులకు అండగా ఉంటానంటూ తేడా వస్తే తనలో మరో మనిషిని వెలికి తీస్తానని హామి ఇచ్చేడు. అంటే తన శక్తేమిటో తెల్సుననేగా! పితృ సమానుడైన పెద్ద ఆంజనేయుల మనసుకి సెగబెట్టి మరీ సైకిలెక్కి కమలం పువ్వుని చెవిలో పెట్టుకుని తిరిగేనని అన్నాడు. స్నేహమంటే బానిసత్వం కాదువాయ్, నాకందరూ ఒకటే కాబట్టే హిందూ, క్రైస్తవ పేర్లు పిల్లలకి పెట్టుకుని తరించేనన్నాడు. రైతుల కిష్టమైతేనే భూములు తీస్కోండి లేకపోతే తనలోని ఉగ్రాంజనేయుల్ని చూపించగలనని అన్నాడు. తేడావస్తే పనిలో పనిగా చనిపోయే వరకూ చద్దిబువ్వ ముట్టనన్నాడు. తన జోలికి వచ్చిన పుల్లారావు, నారాయణలకు పుట్టగతులుండవుగాక అని వాళ్ల పార్టీతో సహా శపించేడు. పచ్చని పంట భూములను హైకోర్టులో బీడు భూములుగా అధికారులు మాయ చేసినందుకు మండిపడ్డాడు. భూములిచ్చి ఉన్న రైతులు తమపై ఏ ఒత్తిడీ లేదని చెప్పగా చిరునవ్వు నవ్వేడు.

                      ఉద్రేకంగా ప్రసంగించి అధికార పార్టీ నాయకుల్ని ఏకీపారేసినా చంద్రబాబ్జీని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకొచ్చిన పితలాటకం రైతులను ఒప్పించి లోక కళ్యాణం జరిపించు పవన్ బాబూ అని నాయకులు ఆ భారం సారు మీదే మోపి, సహకరించమని కోరి ప్రార్థించగా చిద్విలాసంగా కాలరు సర్దుకున్నాడు. మనమందరం తమ్ముడు ఒట్టి సినిమా స్టారే అనుకున్నాం గానీ, నేను రైతును కూడా సుమా అని సాటి రైతులకు భరోసా ఇచ్చేడు. ఆఖరికి అదే అధికార పక్షం వారతో పవన్ బాబు మాటలకు పెడర్థాలు తీయొద్దనే సందేశం ఇప్పించి ధన్యజీవి అయినాడు. శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, భజే వాయుపుత్రం... నమస్తే... జైహింద్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ