ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన పరంగానే కాదు, ఆయన పాలసీలు కూడా ప్రత్యేకమే. ఇప్పుడు కేంద్రం కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. విద్యుత్ విధానంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దేశానికే ఆదర్శమని సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. రాజధాని ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఇంధన శాఖ మంత్రుల సదస్సులో గోయల్ కీలకోపన్యాసం చేశారు. ‘‘విద్యుత్ విధానంలో ఏపీ సీఎం చంద్రబాబును బ్లైండ్ గా అనుసరించవచ్చు. సోలార్, విండ్ పాలసీల రూపకల్పనలో ఏపీ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. విద్యుత్ పొదుపు, సంరక్షణ చర్యలతోపాట నష్ట నివారణ చర్యలు చేపట్టడంలోనూ చంద్రబాబు సర్కార్ పనితీరు అమోఘం. ఆ ప్రభుత్వం రూపొందించిన సోలార్, విండ్ పాలసీలను అన్ని రాష్ట్రాలు అనుసరించడం మంచిది’’ అని ఆయన బాబుపై పొగడ్తల మీద పొగడ్తలు కురిపించారు.