కేంద్ర ప్రణాళిక సంఘ మంత్రి ఎవరికీ ప్రత్యేక హోదా లేదండోయ్ అని చేసిన ప్రకటన, హోదాపై ఆశలు పెట్టుకున్న అవశేషాంధ్రులకు అశనిపాతమయింది. దీనిపై తర్జించడం, బర్జించడం షురూ! ప్రతిపక్షం ఆల్ రెడీ ఢిల్లీలో ధర్మ ప్రకటన ఇచ్చేసి కూర్చుంది. ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం వ్యాకరణపరంగా ముందుకుపోతున్నారు. మన రాష్ట్రం పేరు ప్రత్యేకంగా ఉటంకించనపుడు భుజాలు తడుముకునే పనేమీ లేదు. దీనిపై నీతి ఆయోగ్ నిర్ణయిస్తుందటగా, అప్పుడు చూస్కుందాం అని దుప్పటి కప్పుకుంటున్నారు. ఈ సబ్జెక్టుపై కేబినేట్ సమావేశం జరుగుతున్నా ముఖ్యమంత్రి కిమ్ అనలేదు అని తస్మదీయులు తాటాకులు కడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మన స్టేటు విషయం చాలా సెపరేటు, మందలో కలిపి చూడొద్దు... బీజేపీ రాజ్యసభలో మాటిచ్చింది. కంగారు లేదు అంటున్నారు. అప్పటి ప్రధాని సింగు కొన్ని హామీలు ఇస్తున్నప్పుడు అధికారంలేని వెన్ కం నాయుడు, ప్రత్యేక హోదా ఐదేళ్లేం సరిపోద్ది, పదేళ్లయినా ఉండొద్దూ అని బుగ్గలు నొక్కుకున్నారు. ఇట్టి మాదిరి నీటిపై రాతలు బట్టీపట్టి గద్దెమీద కూర్చోబెట్టేరు మనవాళ్లు. మొత్తానికి అవశేషాంధ్ర ప్రదేశ్ పరిస్థితి కడుదీనంగా ఉంది. కూర్చుండ కుర్చీ అయినా లేదు. నిలుచుండ నీడయిన లేదు. తాత్కాలిక ఆశ్రయం పొందిన చోట ఛీత్కారాలు తప్పడం లేదు. పోనీ పొరుగు పంచన ఉన్నాంకదా కుదురుగా ఉండాలి అనే జ్నానం లేదు. ఎన్ని చెప్పండి ఆంధ్రుల గ్రహస్థితి అస్సలు బాగోలేదు. దట్సాల్!