అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటో తొలగించడంపై కార్యదర్శి సత్యనారాయణ ఛాంబర్ లో జగన్ పార్టీ సభ్యులు రెండు గంటలు తిష్ఠవేసి నిరసించేరు. పార్టీ అన్నాక దాని తాలూకు రాచకార్యాలకు సూత్రధారులు పైలెవల్లోనే ఉంటారు. అధికారపక్షమయినా, ప్రతిపక్షమైనా సరే... ఫోటో తీసేయమన్నా, దానిపై నిరసన తెలపడమన్నా, ఎందుకు ఫోటో తొలగించారని గట్టిగా దబాయిస్తే వచ్చిన సమాధానం దూడగడ్డి కోసం తాటి చెట్టు నెక్కిన చందంగా ఉంది. చిత్ర పటానికి మరమ్మతు అనిన్నీ, ప్రేము బూజు అయిందనిన్నీ కాసేపు అసెంబ్లీ సెక్రటరీ నీళ్లు నమిలేరు. ఇతగాడు అంతటితో ఆగక ఇదిగో ఇక్కడే ఉంది రండి సార్ అని ఫోటో చూపించే ఘనకార్యం చేసి బోర్లాపడ్డాడు. విషయం ఏమంటే ఆ చిత్ర రాజం మూల గదిలో తిరగేసి ఉండగా సభ్యులు చూసి మనసు కష్టపెట్టుకున్నారు. ఇది రాష్ట్రానికి వచ్చిన గడ్డుకాలం, దుష్టసాంప్రదాయం అని వీరావేశంతో హుంకరిస్తున్నారు. అక్కడి ఫోటో సైలెంటుగా తీయించేసి ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్న ప్రభువులు ఏంమాట్లాడకుండా వినోదిస్తున్నారు. ఇంకే పనేలేదా వీళ్లందరికీ...? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాగూ ఢిల్లీ జంతర్ మంతర్ పోతున్నారుగా. రాజన్న బ్రతికి ఉన్నన్నాళ్లు విభజనకు అడ్డంపడుతన్నాడు... అంటే చిద్విలాసంగా అడ్డంలేదు... నిలువు లేదు అనేవాడు. ఢిల్లీ ధర్నాలో ఆ కీర్తిశేషుడి ఫోటో నిలువుగా నిలబెట్టి స్లోగన్ లు ఇస్తే ఆత్మలు హేపీ!