టీడీపీ ఆకర్ష్ అట్టర్ ప్లాప్ షో!

February 12, 2016 | 10:41 AM | 5 Views
ప్రింట్ కామెంట్
chandrababunaidu_operation_akarsh_flop_in_AP_YSRCP_niharonline

తెలంగాణలో గులాబీ దళపతి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య గత మూడు రోజులుగా 15 నుంచి 6కు చేరగా, గురువారం సాయంత్రం మరోక వికెట్ పడిపోయింది. అంతకు ముందు చంద్రబాబుతో చేరికలపై చర్చలో పాల్గొని ప్రసంగించిన వెనువెంటనే కీలక నేతల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించాడు మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి . దీంతో ఆ సంఖ్య ఐదుకి చేరింది. త్వరలో మరో ఇద్దరు కూడా మారతారని సమాచారం. అయితే టీఆర్ఎస్ గట్టిగా వద్దనుకుంటున్న ఓ ముగ్గురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యారంట. వారిలో రేవంత్ రెడ్డి ఖచ్ఛితంగా ఉంటారు. ఇక పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏంటో అర్థం కానీ అయోమయంలో పడిపోయారు చంద్రబాబు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గంలో ఓ సభ్యుడు మాత్రమే. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరూ చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. ఇక రాజకీయ ఎత్తులు, ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడంలో చంద్రబాబు కన్నా తానే ముందున్నానని ఇప్పటికే కేసీఆర్ నిరూపించుకున్నారు. ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేలను ఆకర్షించడం, ఉప ఎన్నికల్లో ఘన విజయాలు, గ్రేటర్ లో ఎవరూ ఊహించని మెజారిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే, ఇక్కడ చంద్రబాబు నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నది ఏంటంటే, పార్టీ నుంచి వలసలు.

                       అది పక్కనబెడితే కేసీఆర్ బాటలోనే, అంటే ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని వారిని ఇబ్బందుల్లోకి నెట్టేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారా?అంటే అంత సీన్ లేదనిపిస్తోంది. కనీసం 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరనున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఎవరి పేర్లయితే 'జంప్ జిలానీ'లుగా ప్రచారం అవుతున్నాయో, వారంతా మీడియా సమావేశాలు పెట్టి తాము పార్టీలను వీడటం లేదని ప్రకటనలు ఇస్తున్నారు. కందుకూరు, అద్దంకి శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్ లు తెలుగుదేశంలో చేరుతారని వార్తలు రాగా, వీరిద్దరూ అటువంటిదేమీ లేదని మీడియాకు చెప్పాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య, కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, తాజాగా జలీల్ ఖాన్ కూడా తాము తెలుగుదేశాన్ని ఆశ్రయించే పరిస్థితే లేదని తెలిపారు. మైండ్ గేమ్ అస్సలు వర్కవుట్ కాదని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు ఇంత రాజకీయ అనుభవం ఉండి, 9 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకి ఎమ్మెల్యేలను ఆకర్షించటం కష్టతరంగా మారటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు 'ఆకర్ష్' పథకానికి ఎవరైనా పడతారో? లేదో? గానీ, తన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ మాత్రం ఈ విషయంలోనూ ఘన విజయం సాధించారనే చెప్పాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ