అధికార పార్టీ వ్యవహార శైలితోనే రిజర్వేషన్ల డిమాండ్లు పుట్టుకొస్తున్నాయని దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు అంటున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో ఏ కులానికి చెందిన వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఏపీ ప్రభుత్వానికి ఆయన సవాలు విసిరారు. కుల వివక్ష చూపుతోంది మీరు కాదా? అని అధికారపార్టీని ఆయన ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితులు కలవరపాటుకు గురిచేస్తున్నాయని ఆయన అంటున్నారు.
గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బహిరంగ చర్చలో తాను ఓటమిపాలైతే వంద కోట్ల రూపాయలు ఇస్తానని, అదే సీఎం చంద్రబాబు ఓటమిపాలైతే పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన బీఆర్ అంబేద్కర్ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నామని ఆయన చెప్పారు. దళితులను అవమానించేలా మాట్లాడినందుకు చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.