ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా పరంగా నిర్ణయాలు పక్కనబెడితే పార్టీ నిర్వహణలో మాత్రం మొదటి నుంచి మంచి నిర్ణయాలతో మేనేజ్ చేస్తూ వస్తున్నారు. నేతల మధ్య అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు ఉన్నా... పార్టీ మీటింగ్ లలో మాత్రం వారంతా ఒకే తాటిపై ఉంటారు. ఒక్కొసారి చంద్రబాబు తీసుకునే హఠాత్ నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా పార్టీలో క్రమశిక్షణ కి ఎటువంటి భంగం కలగదని ఆయన నమ్మకం కూడా. కానీ, తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం భవిష్యత్ లో పార్టీ నేతల మధ్య వైరాన్ని మరింత పెంచేదిగా ఉంది. ఇటీవల ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నిక తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ పదవి కోసం ఓ వైపు గల్లా జయదేవ్, సీఎం రమేష్ లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇది కాస్త ఎంపీల మధ్య తీవ్ర వివాదంగా మారి ఎన్నికల్లో వేడిని పెంచాయి.
దీంతో రంగంలోకి దిగిన అధినేత చంద్రబాబు చివరికి తుదినిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు ఎంపీలను ఏపీఓఏ నుంచి ఉపసంహరింపజేయాలని ఆయన నిర్ణయించారు. రేసు నుంచి ఇరువురిని తప్పించి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
అసలీ వైరం ఎలా మొదలైందంటే... విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో గత ఏప్రిల్ లో తిరుపతిలో ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశమై గల్లా జయదేవ్ ను అధ్యక్ష పదవికి ఏక్రగీవంగా ఎన్నుకుంది. అయితే ఆ ఎన్నిక చెల్లదని తానూ.. అధ్యక్ష రేసులో ఉన్నానని సీఎం రమేష్ ప్రకటించుకున్నారు. ఇదయ్యాక హైదరాబాద్ లో జరిగిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో సీఎం రమేష్ అధ్యక్షుడిగా గెలిచినట్లు ఏకగ్రీవంగా ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. గొడవ మరీ పెద్దది కాకుండా, ఇరువురికి ఇబ్బంది లేకుండా రేసు నుంచి ఉపసంహరింపజేయాలని బాబు నిర్ణయించారు.
అయితే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయనట్లు కనిపించడం లేదు. మరింత ముసలం పెరిగి భవిష్యత్ లో పార్టీలో మరిన్ని గ్రూపు రాజకీయాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు కదా. మొత్తానికి చిత్తూరు రాజకీయాల్లో చీలికలకు చెక్ పెడదామనుకున్న బాబు ఐడియా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.