హరీశ్ రావు పేరులో శాంతాకారం, భుజంగశయనం పాళ్లు మేళవించి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు, ఇటీవల కాలంలో జరిగిన సమ్మె సందర్భంగా రెండు వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తన మాట విని చీపురు పట్టుకోండి అన గులాబీ బాస్ విజ్నప్తికి సుముఖులై ఈ రెండు వేల మంది మినహాయించి అందరూ పుచ్చుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని అల్లుడు హరీశ్ తనను కలిసిన కార్మికుల్ని దెప్పి పొడిచేడు. ఆ ఎర్ర జెండోళ్ల మాట విన్నందుకు చీపురు కోల్పోయేరు. వాళ్ల ఇంటి ముందు బైఠాయించి అరిచి గీపెట్టండి. మా మాట ఆలకించకుండ వారిని నమ్ముకున్నందుకు ఇలాగే అవుతుంది అని సూటిపోటీగా అంటుంటే కార్మికులంతా ముక్తకంఠంతో మహాప్రభో బుద్ధి చెత్త తిన్నది. చెమించండి దొరవారూ, ఎర్రోళ్లని నమ్మిన్నందుకు పస్తులు మిగిలేయి అన్న తదనంతరం శ్రీదొరవారు ప్రసన్నులయి, మామయ్యగారితో మాట్లాడతాం, ఉపకారం జరిపిస్తాం అని ప్రకటించి సెలవు పుచ్చుకోవటం జరిగింది. క్షణక్షణముల్ దొరల చిత్తముల్!