ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర సంభాషణలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న అంబులెన్స్ సర్వీసులపై మాట్లాడిన సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవల సిబ్బందితో వేదికపై నుంచే ఫోన్ మాట్లాడి ‘అంత లేటైతే... ఎలాగమ్మా’ అంటూ ఆగ్రహాం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామంలో జరిగిన జన్మభూమిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతపై ఆసక్తికర కామెంట్లు చేశారు.
కార్యక్రమంలో భాగంగా ఓ లబ్ధిదారుడితో మాట్లాడిన చంద్రబాబు... ‘భార్య మాట వినకుంటే, ఫుడ్ దొరకదు మరి’ అని వ్యాఖ్యానించి సభికుల్లో నవ్వులు పూయించారు. సభలో పలువురితో మాట్లాడిన చంద్రబాబు... ఓ వ్యక్తితో మాట కలిపారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే...
బాబు: మీ పేరు? ఏం చేస్తుంటారు?
లబ్ధిదారుడు: వీరాచారి. కార్పెంటర్‌ని.
బాబు: మీ భార్య చదువుకున్నారా?
లబ్ధిదారుడు: డిగ్రీ వరకు చదువుకున్నారు.
బాబు: బాగా చదువుకుంది. ఆమె అంత చదువుకుందని మీకు ఏమైనా అసూయగా ఉందా?
లబ్ధిదారుడు: ఏమీ లేదు, సంతోషమే.
బాబు: మీ మాట అమ్మాయి వింటుందా.. లేక మీ ఆవిడ మాట మీరు వింటారా?
లబ్ధిదారుడు: నా మాట ఆవిడ.. ఆవిడ మాట నేను వింటాం.
బాబు: చాలా తెలివిగా సమాధానం చెప్పావు. అయినా.. అలా చెప్పకపోతే నీకు ఫుడ్ ఉండదు కదా..!’’
చంద్రబాబు నోట నుంచి ఈ మాట రాగానే సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ప్రజలతో మమేకం అయ్యేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా మెరుగుపడుతున్నాయనే చెప్పొచ్చు. ఓ వైపు పనిచేయని అధికారులపై విరుచుకుపడుతూనే మరోవైపు ఇలా అనుబంధాల గురించి, ఆప్యాయతల గురించి... బాగానే ఉంది.